హనుమకొండ: కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశత్వానికి, అక్రమ హౌస్ అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదని బీజేపీ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పోటీ చేసిన అభ్యర్థి శ్రీమతి రావు పద్మారెడ్డి స్పష్టం చేశారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు పిలుపు మేరకు తలపెట్టిన “ఛలో హైదరాబాద్” కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి, సోమవారం ఉదయం హనుమకొండ హంటర్ రోడ్డులోని ఆమె స్వగృహంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడంపై ఆమె తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా రావు పద్మారెడ్డి మాట్లాడుతూ… రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ అరెస్టులతో ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తోందని, ఇది ప్రభుత్వ దౌర్జన్యానికి పరాకాష్ట అని మండిపడ్డారు. 1975 నాటి దేశవ్యాప్త ఎమర్జెన్సీపైనే వీరోచితంగా పోరాడిన చరిత్ర బీజేపీదని, అలాంటిది రేవంత్ రెడ్డి బెదిరింపులకు వెనకడుగేసేది లేదని తేల్చిచెప్పారు.
ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును ఎవరూ హరించలేరని, పోలీసులు అధికార పార్టీ కార్యకర్తల్లా వ్యవహరించడం మానుకోవాలని హితవు పలికారు. నాయకుల ఇళ్ల వద్ద నుండి పోలీసు బలగాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి యత్నిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲


