తెలంగాణలో పేద మధ్యతరగతి ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటివరకు రేషన్ షాపుల ద్వారా కేవలం బియ్యం మాత్రమే అందుతుండగా, త్వరలో ఆ జాబితాలోకి జొన్నలు, మొక్కజొన్నలు కూడా చేరనున్నాయి. మార్క్ ఫెడ్ సేకరించిన పంటను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ మేరకు అధికారులతో సమీక్ష నిర్వహించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పంపిణీ ప్రక్రియపై కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వ హాస్టళ్లు మరియు గురుకుల పాఠశాలల్లో జొన్నలను ఆహారంగా అందించాలని పేర్కొన్నారు. దీనివల్ల రైతులకు గిట్టుబాటు ధర లభించడమే కాకుండా, సామాన్యులకు పోషక విలువలు కలిగిన ఆహారం అందుతుందని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది.


