మొబైల్ ఫోన్ EMI కట్టకపోతే ఫోన్ లాక్ అయిపోతుందా? అంటే.. అవును అనే సమాధనమే చెప్పాలి.
డిఫాల్టర్లపై కఠిన చర్యలు తీసుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఒక సంచలన ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది.
మనకు తెలిసిందే దేశంలో మొబైల్ ఫోన్లు, టాబ్లెట్‌లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను ఎక్కువుగా EMI పై కొనుగోలు చేస్తుంటారు జనాలు.
రోజు రోజుకి అలా చేసే వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో RBI కీలక ముసాయిదా నిబంధనలు విడుదల చేసింది.

రుణగ్రహీతలు EMI చెల్లించడంలో విఫలమైతే.. నిర్దిష్ట షరతులతో రుణదాతలు మొబైల్ లేదా టాబ్లెట్‌లోని కొన్ని ఫీచర్లను రిమోట్‌గా నిలిపివేయడానికి వీలు కల్పించేలా ఈ ప్రతిపాదనలు రూపొందించారు.
‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సవరణ ఆదేశాలు, 2026’ పేరుతో విడుదలైన ఈ నిబంధనలు అక్టోబర్ 1, 2026 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
ఈ కొత్త నిబంధనల ప్రకారం, రుణం 90 రోజులు బకాయిగా ఉన్నప్పుడే పరికరంపై పరిమితులు విధించవచ్చు.
అయితే, ముందుగా రుణగ్రహీతలకు దశలవారీగా నోటీసులు ఇవ్వడం తప్పనిసరి.

60 రోజుల తర్వాత మొదటి నోటీసు, అనంతరం మరో గడువుతో రెండో నోటీసు జారీ చేసిన తర్వాతే ఆంక్షలు అమలు చేయాలి. వినియోగదారుల స్పష్టమైన సమ్మతి ఉంటేనే ఈ విధానం వర్తిస్తుందని RBI ప్రత్యేకంగా తెలిపింది.
ఇంటర్నెట్ సేవలు, ఇన్‌కమింగ్ కాల్స్, అత్యవసర సేవలు, ప్రభుత్వ హెచ్చరికలను నిలిపివేయరాదని స్పష్టం చేసింది.
బకాయిలు చెల్లించిన గంటలోపే ఆంక్షలు తొలగించాలని, ఆలస్యం అయితే గంటకు రూ.250 పరిహారం చెల్లించాలని పేర్కొంది.
అలాగే రికవరీ ఏజెంట్ల బెదిరింపులు, వేధింపులపై కూడా కఠిన ఆంక్షలు విధించింది.
స్మార్ట్‌ఫోన్ లోన్లు తీసుకుని ఉద్దేశపూర్వకంగా EMI ఎగ్గొట్టే వారిపై నిఘా పెట్టేందుకే RBI ఈ సమగ్రమైన డ్రాఫ్ట్ మార్గదర్శకాలను విడుదల చేసింది.

అంతేకాకుండా కస్టమర్ల మొబైల్‌లో ఉన్న ఎలాంటి వ్యక్తిగత డేటాను బ్యాంకులు చూడటం లేదా నిల్వ చేయడం లేదా వాడుకోవడం లాంటివి పూర్తిగా నిషేధించింది.
దేశంలో 1.16 బిలియన్లకు పైగా మొబైల్ కనెక్షన్లు ఉండటంతో, ఈ కొత్త నిబంధనలు కోట్లాది వినియోగదారులపై ప్రభావం చూపే అవకాశముంది.


