రాష్ట్రంలో ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం 7,437 పోలీస్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను అత్యంత పకడ్బందీగా, పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు.
నియామక ప్రక్రియను అడ్డుకునేందుకు కొన్ని రాజకీయ పార్టీలతో పాటు స్వార్థ ప్రయోజనాలు ఆశిస్తున్న శక్తులు ప్రయత్నిస్తున్నట్లు నిఘా వర్గాలు సీఎంకు సమాచారం అందించాయి. ఈ నేపథ్యంలో డీజీపీ సీవీ ఆనంద్‌తో పాటు పోలీస్ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి అత్యవసర సమావేశం నిర్వహించారు.
పరీక్షల నిర్వహణపై ప్రత్యేక నిఘా
సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి నియామక ప్రక్రియపై పలు కీలక మార్గదర్శకాలను జారీ చేశారు.
ప్రశ్నపత్రాల తయారీ, ముద్రణ, రవాణాతో పాటు నియామక ప్రక్రియకు సంబంధించిన ప్రతి దశలోనూ అధికారులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. పరీక్ష కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడంతో పాటు, కోచింగ్ సెంటర్ల కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచాలి.
సోషల్ మీడియా లేదా ఇతర మాధ్యమాల్లో పరీక్షల నిర్వహణపై ఎలాంటి అవాస్తవాలు, దుష్ప్రచారాలు వ్యాప్తి చెందకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించే దళారులు, నకిలీ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ఖాతాలపై సైబర్ క్రైమ్ విభాగం నిరంతరం దృష్టి సారించాలి.
పరీక్షల నిర్వహణ పూర్తయ్యే వరకు సైబర్ సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్ విభాగాలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సీఎం స్పష్టం చేశారు.
ఈ అత్యవసర సమావేశంలో సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ వి. శేషాద్రి, డీజీపీ సీవీ ఆనంద్, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శిఖా గోయల్, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ వి.వి. శ్రీనివాసరావు, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲


