వరంగల్ జిల్లాలో ఉద్రిక్తత.. అక్రమ మొరం తవ్వకాలపై వెళ్లిన రెవెన్యూ అధికారులపై దాడి:
వరంగల్ జిల్లాలో అక్రమ మొరం తవ్వకాల వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. నర్సంపేట పట్టణ పరిధిలోని మాధన్నపేట చెరువు వద్ద అక్రమంగా మొరం తవ్వుతున్నారనే సమాచారం అందడంతో రెవెన్యూ అధికారులు అక్కడికి వెళ్లి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమ తవ్వకాలను నిలిపివేయాలని సూచించిన అధికారులపై మొరం దందాకు పాల్పడుతున్న కొందరు వ్యక్తులు దాడికి దిగినట్లు సమాచారం.
దాడిలో రెవెన్యూ శాఖకు చెందిన నరసింహస్వామి (జీపీఓ)తో పాటు మరో ఉద్యోగి గాయపడినట్లు తెలిసింది. అంతేకాకుండా వారిని కొంతసేపు బంధించి, వారి సెల్ఫోన్లను లాక్కున్నట్లు బాధితులు ఆరోపించారు. అధికారులపై జరిగిన ఈ దాడి స్థానికంగా కలకలం రేపింది.
గాయపడిన అధికారులు అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ను ఆశ్రయించి జరిగిన ఘటనపై ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. దాడికి పాల్పడిన వ్యక్తులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు.
Read Warangal News and Latest Politics News and Real Estate


