హన్మకొండ: నగరంలోని జులైవాడ సర్కిల్ వద్ద ఆదివారం ఉదయం భయానక రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఆటో ఒక మహిళను ఢీకొట్టడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి.
హన్మకొండకు చెందిన వెల్పుల రజిత (39) తన స్కూటీపై వెళ్తుండగా, వెనుక నుంచి అతి వేగంగా వచ్చిన ఆటో ఆమెను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రజిత తల, దవడ భాగాల్లో తీవ్రమైన లోతైన గాయాలయ్యాయి. ముక్కు మరియు నోటి నుంచి భారీగా రక్తస్రావం జరిగింది.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. 108 సిబ్బంది తక్షణమే స్పందిించి, క్షతగాత్రురాలికి ప్రాథమిక చికిత్స అందించారు. రజిత పరిస్థితి విషమంగా ఉండటంతో, అత్యవసర చికిత్స కోసం ఆమెను ఎంజీఎం (MGM) ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందుతోంది.
పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన ఆటో డ్రైవర్ వివరాల కోసం పోలీసులు వెతుకుతున్నారు. నగరంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


