తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో త్రివేణి సంగమం వద్ద రేపటి నుంచి సరస్వతి అంత్య పుష్కరాలు ప్రారంభం కానున్నాయి.
మే 21 నుంచి ప్రారంభమై జూన్ 1 కి ఈ పుష్కరాలు ముగుస్తాయి. అంటే మొత్తం 12 రోజుల పాటు ఈ పవిత్ర పుష్కర ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో జరగనున్నాయి.
మే 21న మహా గణపతి హోమం నుంచి ప్రారంభమై జూన్ 1న లఘు చండి మహా పూర్ణాహుతితో ముగుస్తాయి.

గోదావరి, ప్రాణహిత, భూగర్భ సరస్వతి నదులు కలిసే “త్రివేణి సంగమ తీరం” భక్తుల సేవకు సంపూర్ణంగా సిద్ధమైంది అని అధికారులు తెలిపారు.
పుష్కరాలల్లో తొలి పుణ్యస్నానం తెల్లవారుజామున 5:43 గంటలకు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఈ శుభ ఘడియల్లో కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి తొలి పుష్కర స్నానం ఆచరించనున్నారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా లాంఛనంగా ప్రారంభించనున్నారు.
రాష్ట్ర గవర్నర్ కూడా ఈ పుణ్యస్నానంలో పాల్గొననున్నారు. ప్రతి రోజు వివిధ పీఠాధిపతులు పాల్గొని హోమాలు, సాయంత్రం హారతి, తెప్పోత్సవాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
అధికారులు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ..తాత్కాలిక బస్ స్టేషన్లు, తాగునీరు, వైద్య శిబిరాలు, అంబులెన్సులు, సీసీటీవీ నిఘా, భద్రతా బలగాలు సిద్ధం చేశారు.
కాలేశ్వరం త్రివేణి సంగమం వద్ద జరుగుతున్న ఈ మహోత్సవానికి సుమారు రూ.30.63 కోట్లతో నిధులు కేటాయించినట్లు తెలుస్తుంది.
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేశాయి. మంత్రులు కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఏర్పాట్లను నిరంతరం సమీక్షిస్తున్నారు.
పవిత్ర స్నానాలు, ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలతో పుష్కర కాలం మొత్తం ఆధ్యాత్మిక వాతావరణం నెలకొననుందని అధికారులు తెలిపారు.
Read Warangal News and Latest Politics News and Real Estate


