వరంగల్: షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలపై జరిగే అట్రాసిటీ కేసుల్లో బాధితులకు ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకు సకాలంలో ఆర్థిక సహాయం అందేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డా. సత్య శారద ఆదేశించారు.
శనివారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో పీసీఆర్/పీఓఏ చట్టం అమలు, బాధితులకు అందించిన పరిహారం, పెండింగ్ కేసులు, నిధుల అవసరం తదితర అంశాలపై జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటివరకు 197 మంది ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ బాధితులు ఉన్నట్లు అధికారులు నివేదించారని తెలిపారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి గానూ బాధితులకు పరిహారం అందించేందుకు రూ.1,57,48,000 బడ్జెట్ అవసరమని అధికారులు ప్రతిపాదించగా.. ప్రభుత్వం ఇప్పటికే రూ.74,48,000 మంజూరు చేసిందని వివరించారు. ఈ నిధుల నుంచి ఇప్పటివరకు 75 మంది లబ్ధిదారులకు రూ.74,35,500 పరిహారం చెల్లించినట్లు కలెక్టర్ వెల్లడించారు.
ఇంకా పరిహారం అందని అర్హులైన బాధితులకు సంబంధించిన నిధుల ప్రతిపాదనలను వెంటనే ప్రభుత్వానికి పంపాలని, పోలీసు శాఖలో పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు సత్వర న్యాయం జరిగేలా రెవెన్యూ, పోలీస్, సాంఘిక సంక్షేమ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
సమావేశంలో పాల్గొన్న అధికారులు:
ఈ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఈస్ట్ జోన్ డిసిపి అంకిత్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి (డిఆర్ఓ) విజయలక్ష్మి, వరంగల్ ఆర్డిఓ సుమా, నర్సంపేట ఆర్డిఓ ఉమారాణి, డిబిసిడివో మరియు డిఎస్డివో ఇంచార్జ్ పుష్పలత, వరంగల్, నర్సంపేట, వర్ధన్నపేట, మామ్నూర్ ప్రాంతాల ఎసిపిలు, ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు మరియు తదితర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.
𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲


