హైదరాబాద్: దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో ఒకటైన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ త్వరలోనే సరికొత్త హంగులతో ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. అత్యాధునిక సాంకేతికత, అంతర్జాతీయ స్థాయి వసతులతో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ స్టేషన్ పునర్నిర్మాణ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి.
ఈ ప్రాజెక్టుకు సంబంధించిన తాజా అప్‌డేట్స్‌ను కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. మొత్తం రూ. 714.73 కోట్ల భారీ బడ్జెట్‌తో చేపట్టిన ఈ మహా ప్రాజెక్టులో ఇప్పటివరకు 64 శాతం పనులు విజయవంతంగా పూర్తయ్యాయి.
స్టేషన్‌లో అందుబాటులోకి రానున్న అత్యాధునిక వసతులు:
నయా లుక్‌లో బిల్డింగ్స్: అత్యాధునిక డిజైన్లతో కూడిన స్టేషన్ భవనాల నిర్మాణం.
ఎయిర్ కాన్‌కోర్స్: విశాలమైన ప్లాట్‌ఫారమ్ రూఫ్ ఏరియాతో కూడిన రెండు అంతస్తుల ఎయిర్ కాన్‌కోర్స్ సౌకర్యం.
భారీ రూఫ్ టాప్: ప్లాట్‌ఫారమ్‌లన్నింటినీ కవర్ చేసే విధంగా భారీ రూఫ్ టాప్ నిర్మాణం.
మల్టీ-లెవెల్ పార్కింగ్: వాహనదారుల సౌకర్యార్థం అంతస్తుల వారీగా విశాలమైన పార్కింగ్ వసతి.

లిఫ్టులు & ఎస్కలేటర్లు: ప్రయాణికులు సులభంగా రాకపోకలు సాగించేందుకు వీలుగా 26 లిఫ్టులు, 32 ఎస్కలేటర్ల ఏర్పాటు.
మెట్రో కనెక్టివిటీ: సికింద్రాబాద్ ఈస్ట్ & వెస్ట్ మెట్రో స్టేషన్లను అనుసంధానించేలా అత్యాధునిక స్మార్ట్ స్కైవాక్.
గ్రీన్ ఎనర్జీ & ఈవీ చార్జింగ్: సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఈవీ (EV) చార్జింగ్ పాయింట్లు.
భద్రత: స్టేషన్ అంతటా నిరంతర నిఘా కోసం సీసీటీవీ కెమెరాలతో కూడిన హైటెక్ సెక్యూరిటీ సిస్టమ్.
ఇప్పటికే పూర్తయిన పనులు:

ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయంగా చేపట్టిన తాత్కాలిక బుకింగ్ ఆఫీస్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) భవనం, కాజీపేట వైపు ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ (FOB), అలాగే దక్షిణ వైపు అప్రోచ్ రోడ్డు పనులు ఇప్పటికే పూర్తయ్యాయి.
ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్న పనులు:

దక్షిణం వైపు బేస్‌మెంట్ మరియు స్టేషన్ భవన నిర్మాణ పనులతో పాటు, ఉత్తరం వైపు మల్టీ-లెవెల్ పార్కింగ్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. వీటితో పాటు ప్లాట్‌ఫారమ్‌లపై పైకప్పు పనులు, హైదరాబాద్ వైపు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, ట్రావలెటర్, మురుగునీటి శుద్ధి ప్లాంట్ (STP) నిర్మాణ పనులు ప్రస్తుతం చివరి దశకు చేరుకున్నాయి.
గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో తెలంగాణలో రైల్వే మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రయాణికులకు అంతర్జాతీయ స్థాయి అనుభూతిని అందించడమే లక్ష్యంగా ఈ పనులు జరుగుతున్నాయని కేంద్రమంత్రి పేర్కొన్నారు.
Read Warangal News and Latest Politics News and Real Estate


