దేశవ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. వరుసగా ఆరు నెలల పాటు రేషన్ సరుకులు తీసుకోని లబ్ధిదారుల కార్డులను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించింది.
అక్టోబర్ నెల నుంచి దేశవ్యాప్తంగా దాదాపు 1.58 కోట్ల రేషన్ కార్డులు నిలిచిపోయే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
రేషన్ పంపిణీ వ్యవస్థలో పారదర్శకతను పెంచేందుకు, మరణించిన వారి పేర్లు, డూప్లికేట్ కార్డులు, నకిలీ వివరాలతో సరుకులు పొందుతున్న అనర్హులను తొలగించే ప్రక్రియలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
కార్డు మళ్లీ యాక్టివేట్ అవ్వాలంటే?
తాత్కాలికంగా నిలిపివేసిన కార్డులను తిరిగి పునరుద్ధరించుకోవడానికి లబ్ధిదారులు తప్పనిసరిగా ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.
లబ్ధిదారులు తమ మొబైల్‌లోని ‘మేరా రేషన్’ యాప్ ద్వారా సులభంగా ఈ-కేవైసీ చేసుకోవచ్చు. లేదా సమీపంలోని మీ-సేవ / సీఎస్‌సీ కేంద్రాలను సంప్రదించి బయోమెట్రిక్ ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చని అధికారులు సూచించారు.
సరైన అర్హత ఉన్న కార్డుదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వెంటనే ఈ-కేవైసీ పూర్తి చేసుకుని తమ రేషన్ కార్డులను యథావిధిగా కొనసాగించుకోవాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.


