హన్మకొండ: నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని అరికట్టేందుకు మరియు పార్కింగ్ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం కీలక అడుగు వేసింది. హన్మకొండలోని అత్యంత రద్దీ ప్రాంతమైన అశోక థియేటర్ వద్ద సుమారు రూ. 15 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ‘మల్టీ పర్పస్ కార్ పార్కింగ్’ కేంద్రానికి రాష్ట్ర మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారు ఈరోజు భూమి పూజ చేసి, శంకుస్థాపన చేశారు.
శంకుస్థాపన అనంతరం మంత్రి మాట్లాడుతూ, హనుమకొండను ఒక స్మార్ట్ సిటీగా, మోడల్ సిటీగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ మల్టీ లెవల్ పార్కింగ్ అందుబాటులోకి వస్తే సామాన్య ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని, వ్యాపార ప్రాంతాల్లో రద్దీ తగ్గుతుందని తెలిపారు. పనుల్లో నాణ్యత పాటిస్తూ, నిర్ణీత గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో హన్మకొండ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు మరియు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.


