న్యూఢిల్లీ – పార్లమెంట్
తేదీ: 02-04-2026
దేశంలో 16 ఏళ్ల లోపు పిల్లలపై సోషల్ మీడియా ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో, ఆ వయస్సు గల వారికి సోషల్ మీడియా వినియోగంపై నిషేధం విధించాలని వరంగల్ లోక్‌సభ సభ్యురాలు డా. కడియం కావ్య కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
పార్లమెంట్‌లో ఈ అంశాన్ని ప్రస్తావించిన ఆమె, సోషల్ మీడియా వేదికలు చిన్నారులపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా తప్పుడు సమాచార వ్యాప్తి, ఆన్‌లైన్ దూషణలు, విభజనాత్మక వ్యాఖ్యలు వంటి అంశాలు సమాజంలో ప్రతికూల వాతావరణాన్ని సృష్టిస్తున్నాయని తెలిపారు.
అదే విధంగా, నియంత్రణలు లేకుండా కొనసాగుతున్న డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు ప్రజల ఆలోచనలను తప్పుదారి పట్టించే ప్రమాదం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. చిన్నారుల మానసిక ఆరోగ్యం మరియు భవిష్యత్తు దృష్ట్యా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కేంద్రాన్ని కోరారు.
అవసరమైతే 16 ఏళ్ల లోపు వారికి సోషల్ మీడియా వినియోగంపై సంపూర్ణ నిషేధం అమలు చేయాలని ఆమె సూచించారు.


