హైదరాబాద్: నగర శివారులోని కోహెడ శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇంటర్ సెకండియర్ చదువుతున్న ఒక విద్యార్థి హాస్టల్ గదిలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది.
తల్లిదండ్రుల అనుమానాలు – యాజమాన్యం నిర్లక్ష్యం?
మృతుడైన తమ కుమారుడు కేవలం 4 రోజుల క్రితమే హాస్టల్కు వచ్చాడని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఘటన జరిగిన తర్వాత కూడా దాదాపు 3 గంటల వరకు తమకు ఎలాంటి సమాచారం అందించకపోవడంపై వారు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు కాలేజీ యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాలేజీ ముందు విద్యార్థి సంఘాల ఆందోళన:
విషయం తెలియగానే విద్యార్థి సంఘాలు కాలేజీ వద్దకు చేరుకుని గేటు ముందు ధర్నాకు దిగాయి. విద్యార్థి మృతికి కారణాలపై స్పష్టత ఇవ్వాలని, యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. కాగా, ఉద్రిక్తత వాతావారణం నెలకొనడంతో యాజమాన్యం కాలేజీలోని ఇతర విద్యార్థులను అత్యవసరంగా ఇళ్లకు పంపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


