స్టేషన్ ఘనపూర్, మార్చి 13:
స్టేషన్ ఘనపూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ 2026–27 బడ్జెట్ సమావేశానికి మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరయ్యారు.
ఈ సందర్భంగా 2026–27 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ అంచనాల ప్రతిపాదనలను పరిశీలించి చర్చించారు. అనంతరం రూ.63 కోట్ల 33 లక్షల 70 వేల బడ్జెట్ అంచనాలకు మున్సిపాలిటీ పాలకవర్గం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
పట్టణ కేంద్రంలో మార్కెట్ ఏర్పాటు కోసం బస్టాండ్ సమీపంలోని శ్రీ తిరుమలనాథ ఆలయ భూమిని లీజుకు తీసుకోవడం, అలాగే పట్టణంలో పార్క్ అభివృద్ధి చేసి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసేందుకు వక్ఫ్ బోర్డు అధీనంలోని సుమారు 4 ఎకరాల భూమిని లీజుకు తీసుకోవడం వంటి తీర్మానాలను కూడా పాలకవర్గం ఆమోదించింది. ఈ ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించనున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో వంద శాతం పన్నులు వసూలు అయ్యేలా అధికారులు, కౌన్సిలర్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలోని ఇతర మున్సిపాలిటీల్లో పన్నుల అమలు విధానాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు.
సామాన్య, పేద ప్రజలపై అధిక భారం పడకుండా ముందుగా వాణిజ్య, వ్యాపార పన్నులను వసూలు చేయాలని సూచించారు. పన్నుల వసూలు జరిగితేనే ఉద్యోగులకు జీతాలు చెల్లించడం, అభివృద్ధి పనులు చేపట్టడం సాధ్యమవుతుందని తెలిపారు.
ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ, వైస్ చైర్మన్ నీల రాజమ్మ, కౌన్సిలర్లు, మున్సిపల్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.


