స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని ఇప్పగూడెం, జిట్టేగూడెం-తాటికొండ, గార్లగడ్డ తండా-ఫతేపూర్‌లలో జరుగుతున్న సమ్మక్క–సారలమ్మ మినీ జాతరల సందర్భంగా మాజీ ఉప ముఖ్యమంత్రి, స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు త్రాగునీటి సరఫరా, తాత్కాలిక మరుగుదొడ్లు, పారిశుధ్యం, రోడ్ల మరమ్మతులు, హైమాస్ట్ ఫ్లడ్ లైట్లు వంటి అనేక అభివృద్ధి పనులను ప్రారంభించారు.
వచ్చే జాతర నాటికి నియోజకవర్గంలోని అన్ని మినీ జాతరల్లో శాశ్వత నిర్మాణాలు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా త్రాగునీరు, విద్యుత్, పారిశుధ్యం వంటి మౌలిక సదుపాయాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.
పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే నేపథ్యంలో ముందస్తుగానే అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, త్రాగునీటి సరఫరా, విద్యుత్, మరుగుదొడ్లు, రహదారులు, లైటింగ్, పారిశుధ్యం, వైద్య శిబిరాలు, పోలీస్ బందోబస్తు వంటి అంశాల్లో అన్ని శాఖలతో సమన్వయంతో పనులు చేపడుతున్నామని వివరించారు.
భక్తులు ప్రశాంత వాతావరణంలో తల్లులను దర్శించుకుని, మొక్కులు చెల్లించుకుని, సురక్షితంగా ఇంటికి చేరుకోవాలని కోరారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేయాలని సూచించారు.
వనదేవతల దీవెనలతో నియోజకవర్గ ప్రజలు సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


