ఓటు హక్కుపై కుట్రలను తిప్పికొట్టాలి.. కాంగ్రెస్ శ్రేణులకు కడియం కావ్య పిలుపు:
జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో నిర్వహించిన బూత్ లెవల్ ఏజెంట్ల శిక్షణా శిబిరంలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య పాల్గొని కార్యకర్తలకు కీలక సూచనలు చేశారు. సోమేశ్వర కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డితో కలిసి ఆమె బూత్ స్థాయి నాయకులకు ఎన్నికల సంఘం చేపడుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఎంపీ కడియం కావ్య, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును కాపాడుకోవడం ప్రస్తుతం అత్యంత ముఖ్యమైన బాధ్యతగా మారిందన్నారు. ఓటర్ల జాబితాల్లో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా ప్రతి బూత్ స్థాయిలో కాంగ్రెస్ కార్యకర్తలు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఓటర్ల జాబితాలో అర్హులైన వ్యక్తుల పేర్లు లేకపోవడం వారి రాజ్యాంగ హక్కులను హరించినట్లేనని ఆమె పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియలో ఓటర్ల జాబితాల నిర్వహణ కీలక అంశంగా మారిందని, ప్రతి బూత్ లెవల్ ఏజెంట్ తమ పరిధిలోని కుటుంబాలను సంప్రదించి ఓటర్ల వివరాలను పరిశీలించాలని సూచించారు. కొత్త ఓటర్ల నమోదు, పేర్ల సవరణ, చిరునామా మార్పులు, తొలగించబడిన పేర్ల పునరుద్ధరణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఇందుకోసం డోర్ టు డోర్ కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో అవగాహన పెంచాలని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ లక్ష్యం ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించడమేనని, ఎవరూ తమ ఓటు హక్కును కోల్పోకుండా చూడటం కార్యకర్తల బాధ్యత అని ఆమె అన్నారు. బూత్ స్థాయిలో బలమైన వ్యవస్థ ఉంటేనే పార్టీ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంతో పాటు వారి సమస్యలను పార్టీ దృష్టికి తీసుకురావాలని కార్యకర్తలకు సూచించారు.
అనంతరం బూత్ లెవల్ ఏజెంట్ల కోసం రూపొందించిన ‘సంక్షిప్త సమాచారం హ్యాండ్‌బుక్’ను ఎంపీ కడియం కావ్య ఆవిష్కరించి నాయకులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, జిల్లా కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, బూత్ అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Read Warangal News and Latest Politics News and Real Estate


