భద్రకాళి చెరువు పరిరక్షణకు చర్యలు వేగవంతం చేయాలి: ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
వరంగల్ నగరంలోని ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందిన భద్రకాళి చెరువులోకి మురుగునీరు చేరకుండా తక్షణ చర్యలు చేపట్టాలని పశ్చిమ వరంగల్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కుడా కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు.
ఈ సమావేశంలో కుడా చైర్మన్ ఇనగల వెంకట్రామ్ రెడ్డి వరంగల్ మరియు హనుమకొండ జిల్లాల కలెక్టర్లు సత్యశారదా దేవి, చాహత్ బాజ్పాయ్ తదితర అధికారులు పాల్గొన్నారు. భద్రకాళి చెరువు పూడికతీత పనులు వేగవంతం చేయడంతో పాటు మాడవీధుల అభివృద్ధి పనులను నిర్దేశిత గడువుల్లోగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. చెరువుకు అవసరమైన గేట్ల ఏర్పాటును వారం రోజుల్లో పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.
హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ పై మాట్లాడుతూ..”మాడవీధులకు సంబంధించిన స్టోన్ వర్క్ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు”. వరంగల్ కలెక్టర్ సత్యశారదా దేవి మాట్లాడుతూ.. “రైల్వే గేట్ సమీపంలోని ఇరుకు మార్గం ద్వారా నగర మురుగునీరు భద్రకాళి చెరువులోకి చేరే అవకాశం ఉందని పేర్కొన్నారు”. దీనిపై సంబంధిత శాఖలు సమన్వయంతో ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించారు.
సమీక్ష సమావేశానికి ముందు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కుడా చైర్మన్ మరియు అధికారులతో కలిసి పద్మాక్షి శివమూర్తి ధామ్ ను సందర్శించి అక్కడ అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని తనిఖీ చేసి మిగిలిన పనులను త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. నగర అభివృద్ధి పర్యావరణ పరిరక్షణ అంశాల్లో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా చర్యలు కొనసాగించాలని ఆయన స్పష్టం చేశారు.


