వరంగల్: నగరంలో వీధి కుక్కల బెడద రోజురోజుకూ మితిమీరిపోతోంది. వరంగల్ 35వ డివిజన్ పరిధిలోని నాలుగు జెండాల ప్రాంతంలో ఓ చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
చిన్నారి ఆడుకుంటుండగా కుక్కలు ఒక్కసారిగా మీద పడి దాడి చేస్తున్న దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నగరవాసులు భయాందోళనకు గురవుతున్నారు. కుక్కల గుంపుల భయంతో బయటకు రావాలంటేనే వణికిపోతున్నామని, పిల్లలను ఒంటరిగా పంపలేకపోతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. గ్రేటర్ మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి, కుక్కల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.


