జనగామ జిల్లాలోని కొడవటూరు గ్రామంలో వీధి కుక్కల స్వైర విహారం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. గ్రామంలో అర్ధరాత్రి సమయంలో ఆరు బయట నిద్రిస్తున్న పలువురిపై వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేయడంతో తీవ్ర కలకలం రేగింది.
ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడగా కుటుంబ సభ్యులు మరియు గ్రామస్తులు వెంటనే వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. స్థానికుల వివరాల ప్రకారం.. ఇటీవల గ్రామంలో వీధి కుక్కల సంఖ్య గణనీయంగా పెరిగిందని.. రాత్రి వేళల్లో గుంపులుగా తిరుగుతూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి అని తెలిపారు.

ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు రావడానికి భయపడుతున్న పరిస్థితి నెలకొంది. రాత్రి వేళల్లో కుక్కలు అరుపులు, దాడులు భయంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటన తర్వాత గ్రామ ప్రజలు అధికారుల నిర్లక్ష్యంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
గ్రామంలో పెరుగుతున్న వీధి కుక్కల సమస్యను తక్షణమే నియంత్రించాలని, కుక్కలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను పంపించాలి అని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గాయపడిన వారిని మెరుగైన వైద్యం అందించడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటన పునామృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఈ సంఘటనతో కొడవటూరు గ్రామంలో భయాందోళన వాతావరణం నెలకొనగా, అధికారులు త్వరితగతిన స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.


