తెలంగాణ కేబినెట్ నుంచి మంత్రి కొండా సురేఖ బర్తరఫ్ కావడంపై ఆమె కుమార్తె కొండా సుస్మిత స్పందించారు. తన తల్లి విషయంలో చోటుచేసుకున్న పరిణామాలు తీవ్రంగా బాధించాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ప్రముఖ న్యూస్ ఛానెల్ తో మాట్లాడిన సుస్మిత.. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిపై తాను చేసిన వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతమని స్పష్టం చేశారు.
‘నా వ్యాఖ్యలు రాజకీయ పార్టీకి వ్యతిరేకం కాదు’ :
తాను చేసిన ప్రకటనకు ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని సుస్మిత తెలిపారు. ఒక రాజకీయ పార్టీని లక్ష్యంగా చేసుకుని తాను మాట్లాడలేదని, వ్యక్తిగత హోదాలో ఒక వ్యక్తికి వ్యతిరేకంగా మాత్రమే తన అభిప్రాయాన్ని వెల్లడించానని చెప్పారు. ఈ వ్యాఖ్యలు తన తల్లి రాజకీయ వ్యవహారాలతో ముడిపెట్టడం సరికాదని పేర్కొన్నారు.
తల్లికి అండగా ఉంటా :
తన తల్లికి జరిగిన పరిణామాలపై సుస్మిత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘నేను రేవంత్ రెడ్డిని శపిస్తున్నాను . నా తల్లికి అన్యాయం జరిగింది. ఆమెను ఈ పరిస్థితుల్లో చూడటం ఎంతో బాధ కలిగించింది’’ అని అన్నారు. తన తల్లి ఎలాంటి ఒత్తిడికీ తలొగ్గబోరని, ఆమెకు తాను ఎప్పటికీ అండగా ఉంటానని స్పష్టం చేశారు.
రేవంత్ రెడ్డికి సుస్మిత సవాల్:
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి సుస్మిత సూటిగా సవాల్ విసిరారు. తన తల్లి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం నుంచి రేవంత్ రెడ్డి పోటీ చేయాలని సవాల్ చేశారు. పరకాల నియోజకవర్గానికి సంబంధించిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో సుస్మిత చేసిన వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారాయి.


