హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలకు తెరలేచింది. మేడే సందర్భంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నేతృత్వంలోని తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) లోకి భారీగా మాజీ మావోయిస్టులు, ఉద్యమకారులు చేరారు.
ఈ సందర్భంగా బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ వేదికగా జరిగిన కార్యక్రమంలో మల్లన్న కీలక వ్యాఖ్యలు చేశారు.
మాజీ మావోయిస్టులు అడవిలో ఏ ఆశయాల కోసమైతే పోరాడారో, వాటిని చట్టాలుగా మారుస్తామని మల్లన్న ప్రకటించారు.
వారి ఆమోదం పొందిన తర్వాతే పార్టీ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్తామని స్పష్టం చేశారు.
పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా సీనియర్ మాజీ దళ కమాండర్, ‘అడవి పుత్రిక’ రచయిత్రి పటేల్ వనజక్క బాధ్యతలు స్వీకరించారు.
ఒక దర్జీ బిడ్డగా, ఉద్యమకారిణిగా ఆమె అనుభవం పార్టీకి బలమని మల్లన్న పేర్కొన్నారు.
మహిళలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్లు ఇచ్చేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని ఆయన వెల్లడించారు. “ఎవరెంతో వారికంత – ఎవరి సొమ్ము ఎవడు తినొద్దు” అనే నినాదంతో 2029లో బీసీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు.
ఖమ్మం, వరంగల్, హనుమకొండ, మంచిర్యాల, ములుగు వంటి వివిధ జిల్లాల నుండి వందలాది మంది మల్లన్న సమక్షంలో పార్టీలో చేరారు.
ఖమ్మం నుండి ఉపేంద్ర భాయ్, కాజీపేట ఉద్యమకారుడు గోపన్న భార్య (మాజీ జెడ్పిటిసి), న్యాయవాది పద్మక్క, చిలువేరు రమ్య, అనసూర్య, స్వర్ణక్క, ‘భారత్ బచావో’ ఉద్యమ నేత ప్రవీణ్, దాడి రవన్న, సంఘం సామన్న, బాబన్న తదితరులు.
తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరడంపై వనజక్క స్పందిస్తూ, ప్రస్తుత పాలనలో రాజ్యాంగం కన్నా ‘మనువాదం’ ఎక్కువైందని విమర్శించారు.
“93 శాతం ఉన్న బహుజనుల ఓట్లతో 8 శాతం ఉన్న ఉన్నత వర్గాల వారు రాజ్యమేలుతున్నారు. బీసీలకంటూ ఒక లెక్క, పత్రం లేని పరిస్థితి నేడు ఉంది.
బడుగు వర్గాల విముక్తి కోసం మల్లన్నతో కలిసి నడవాలని నిర్ణయించుకున్నాను.”
రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ పాదయాత్ర చేపట్టనున్నట్లు తీన్మార్ మల్లన్న ప్రకటించారు.
భువనగిరి వేదికగా త్వరలోనే భారీ బహిరంగ సభ నిర్వహించి, జిల్లాల వారీగా మరిన్ని చేరికలు ఉంటాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
అడవి నుంచి జనారణ్యంలోకి వచ్చిన విప్లవ గొంతుకలు ఇప్పుడు ఎన్నికల గోదాలోకి దిగుతుండటం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. 2029 రాజ్యాధికారమే లక్ష్యంగా టీఆర్పీ తన సైన్యాన్ని సిద్ధం చేస్తోంది.


