రాష్ట్రంలో ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాలతో సంబంధం లేకుండా రసాయనాలు, వెజిటబుల్ ఫ్యాట్స్, ఇతర కృత్రిమ పదార్థాలతో తయారుచేసే నాన్-డెయిరీ లేదా ‘అనలాగ్ పనీర్’ తయారీ, నిల్వ, విక్రయాలపై ఏడాది పాటు నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ మేరకు తెలంగాణ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ అథారిటీ కమిషనర్ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ‘ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్, 2006’ నిబంధనలకు లోబడి ఈ నిషేధాజ్ఞలు అమలులోకి వస్తాయని అధికారులు స్పష్టం చేశారు.
నిషేధంలోని ముఖ్యాంశాలు:
రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి నాన్-డెయిరీ లేదా కృత్రిమ పనీరు తయారు చేయడం, ప్రాసెసింగ్, ప్యాకింగ్, నిల్వ చేయడం, పంపిణీ లేదా విక్రయించడం చట్టరీత్యా నేరం.
ఈ నిషేధం 2026, సెప్టెంబర్ 10వ తేదీ నుంచి అమలులోకి వచ్చి.. ఒక సంవత్సరం పాటు కొనసాగుతుంది.
ప్రభుత్వం దీనికి సంబంధించి సెప్టెంబర్ 10న అధికారిక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
అసలైన డెయిరీ పనీర్ పేరుతో మార్కెట్లో యథేచ్ఛగా విక్రయిస్తున్న నకిలీ, రసాయనిక పనీర్ వల్ల ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోందని ఫుడ్ సేఫ్టీ అధికారులు వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించి కృత్రిమ పనీర్ విక్రయించే వ్యాపారులు, హోటళ్లు, తయారీదారులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲


