హనుమకొండ:రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయకుండా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని బీజేపీ రాష్ట్ర నాయకురాలు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కాంటెస్టెడ్ కాండిడేట్ శ్రీమతి రావు పద్మ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
భారతీయ జనతా యువమోర్చా (BJYM) హనుమకొండ జిల్లా అధ్యక్షుడు తీగల భరత్ గౌడ్ ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా పరిధిలోని పలు ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీలలో “ఫీజు బకాయి – బీజేపీ లడాయి” నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రావు పద్మ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల తెలంగాణ యువత తీవ్రంగా నష్టపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో కళాశాల యాజమాన్యాలు సర్టిఫికెట్లు నిలిపివేస్తున్నాయని, ఫలితంగా విద్యార్థులు ఉద్యోగ ఇంటర్వ్యూలకు హాజరు కాలేక తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ అందక ఉన్నత విద్య ప్రశ్నార్థకంగా మారిందని, నిరుద్యోగ భృతి హామీని కూడా ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు.
న్యాయమైన డిమాండ్ల కోసం ప్రశ్నించిన విద్యార్థులు, నిరుద్యోగులపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం క్రిమినల్స్‌గా ముద్ర వేయడం దారుణమని ఆమె మండిపడ్డారు. అర్హులైన ప్రతి విద్యార్థికి ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు వెంటనే విడుదల చేసే వరకు బీజేపీ, BJYM ఆధ్వర్యంలో రాజీలేని పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల ప్రతినిధులు, విద్యార్థులు, BJYM నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲


