హైదరాబాద్:రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ (ఎల్ నినో) పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సాగు నీటి కొరతను అధిగమించి, రైతులకు అండగా నిలిచేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యామ్నాయ విత్తనాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇందులో భాగంగా నేటి (మంగళవారం) నుంచి ఈ నెల 30వ తేదీ వరకు రాష్ట్రంలోని 2,601 రైతు వేదికల్లో ప్రత్యేకంగా ‘విత్తన మేళాలు’ నిర్వహించనున్నారు.
ఈ మేళాల్లో తక్కువ నీటి లభ్యతతో, తక్కువ కాలంలోనే సాగు చేయగల ప్రత్యామ్నాయ పంటల విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచనున్నారు. ముఖ్యంగా పెసర, మినుము, కంది, నువ్వులు, వేరుశనగ వంటి పప్పుధాన్యాలు, నూనెగింజలతో పాటు వివిధ రకాల కూరగాయలు, తక్కువ నీటితో పండే కొన్ని రకాల సన్న వరి విత్తనాలను రైతులకు పంపిణీ చేయనున్నారు.
ఈ విత్తన మేళాల సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు రైతు వేదికల వద్ద అందుబాటులో ఉండి రైతులకు అవగాహన కల్పించనున్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఏయే పంటలు వేయాలి? తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి సాధించడం ఎలా? అనే అంశాలపై రైతులకు తగిన సలహాలు, సూచనలు అందించనున్నారు. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.


