ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ తెలంగాణ ప్రభుత్వంతో సన్నిహితంగా కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపింది.
వాతావరణ మార్పులు, వ్యవసాయ రంగం, పట్టణ కాలుష్యం, ట్రాఫిక్ నియంత్రణ, సైబర్ సెక్యూరిటీ, స్టార్టప్‌లు వంటి ముఖ్యమైన రంగాల్లో పూర్తి స్థాయి సహకారం అందించేందుకు సిద్ధంగా ఉందని గూగుల్ ఏపీఏసీ ప్రెసిడెంట్ సంజయ్ గుప్తా స్పష్టం చేశారు.
దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (WEF 2026)లో తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు నేతృత్వంలోని ‘తెలంగాణ రైజింగ్‘ బృందం గూగుల్ ఏపీఏసీ ప్రెసిడెంట్ సంజయ్ గుప్తాతో కీలక సమావేశం నిర్వహించింది.
ఈ సమావేశంలో వాతావరణ మార్పుల ప్రభావం, వ్యవసాయ రంగంపై దాని ప్రభావాలు, పట్టణ ప్రాంతాల్లో పెరిగిపోతున్న కాలుష్య సమస్యలపై లోతుగా చర్చలు జరిగాయి.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న CURE, PURE, RARE అభివృద్ధి నమూనాను వివరించారు.
హైదరాబాద్ కోర్ సిటీని కాలుష్య రహిత నగరంగా మార్చేందుకు చేపట్టిన ప్రణాళికలను వివరించారు.
ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, సైబర్ సెక్యూరిటీ, స్టార్టప్ ఇన్నోవేషన్‌లలో మరిన్ని సహకార అవకాశాలను ముఖ్యమంత్రి ప్రస్తావించారు.
హైదరాబాద్‌లో తొలి Google for Startups Hub ఏర్పాటు చేసినందుకు గూగుల్ బృందానికి ముఖ్యమంత్రి గారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
వ్యవసాయ రంగంలో ఎరువుల అతిగా వాడటం వల్ల వస్తున్న సమస్యలు, రైతులకు సరైన అవగాహన కల్పించడం, సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం అవసరమని ముఖ్యమంత్రి గారు స్పష్టం చేశారు.
సంజయ్ గుప్తా గారు మాట్లాడుతూ… ట్రాఫిక్ నియంత్రణ, సైబర్ సెక్యూరిటీ, వ్యవసాయం, స్టార్టప్‌లు, వాతావరణ మార్పుల అంశాల్లో తెలంగాణ ప్రభుత్వానికి పూర్తి సహకారం అందించడానికి గూగుల్ సంసిద్ధంగా ఉందని తెలిపారు.

మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు తెలంగాణలో నడుస్తున్న విస్తృత నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.
Young India Skills University, BFSI స్కిల్లింగ్, ఖాన్ అకాడమీ, ఫిజిక్స్ వాలా భాగస్వామ్యం, AI పాఠ్యాంశాల అమలు వంటివి ప్రస్తావించారు. పాఠశాలలకు ఉచిత విద్యుత్, T-Fiber ద్వారా హైస్పీడ్ ఇంటర్నెట్ అందిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు.
ఈ సమావేశంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం గ్లోబల్ టెక్ దిగ్గజాలతో ఇలాంటి భాగస్వామ్యాల ద్వారా రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తోంది! 🚀


