తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు సంబంధించి కొత్త ఓటర్ల జాబితా రూపకల్పనకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. 2027 మార్చిలో మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్, వరంగల్–ఖమ్మం–నల్గొండ గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల్లో ఖాళీలు ఏర్పడనున్న నేపథ్యంలో ఈ ప్రక్రియను చేపట్టనున్నారు.
సెప్టెంబర్ 28న ప్రజా నోటీసు :
ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియకు సంబంధించి 2026 సెప్టెంబర్ 28న ప్రజా నోటీసు జారీ చేయనున్నారు. అనంతరం అర్హులైన గ్రాడ్యుయేట్ల నుంచి దరఖాస్తులను స్వీకరించేందుకు చర్యలు ప్రారంభమవుతాయి. అక్టోబర్ 15న పత్రికల్లో తొలి పునఃప్రచురణ, అక్టోబర్ 25న రెండో పునఃప్రచురణ చేపట్టనున్నారు.
ఫారం-18 దరఖాస్తులకు చివరి తేదీ :
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకోవాలనుకునే అర్హులు నవంబర్ 6లోగా ఫారం-18 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుతో పాటు అవసరమైన ధ్రువపత్రాలు, సంబంధిత సర్టిఫికెట్ల ధృవీకరించిన ప్రతులను సమర్పించాల్సి ఉంటుంది.
నవంబర్ 25న ముసాయిదా జాబితా :
నవంబర్ 20 నాటికి ముసాయిదా ఓటర్ల జాబితా ముద్రణ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. నవంబర్ 25న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు. అదే రోజు నుంచి డిసెంబర్ 10 వరకు జాబితాపై క్లెయిమ్‌లు, అభ్యంతరాలను స్వీకరిస్తారు.
డిసెంబర్ 30న తుది జాబితా :
అందిన క్లెయిమ్‌లు, అభ్యంతరాలను పరిశీలించి డిసెంబర్ 25లోగా పరిష్కరించనున్నారు. అనంతరం మార్పులు, చేర్పులతో డిసెంబర్ 30న తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు.
ప్రస్తుత ఓటర్లకూ కొత్తగా దరఖాస్తు :
ఇప్పటికే ఓటర్ల జాబితాలో పేర్లు ఉన్న గ్రాడ్యుయేట్లు కూడా కొత్తగా రూపొందించిన ఫారం-18లో దరఖాస్తు చేసుకోవాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. సంబంధిత ధ్రువపత్రాలు, సర్టిఫికెట్ల ధృవీకరించిన కాపీలను దరఖాస్తుతో పాటు సమర్పించాల్సి ఉంటుంది. అర్హులైన గ్రాడ్యుయేట్లు నిర్ణీత గడువులోగా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు సూచించారు.


