వృద్ధాప్యంలో కన్నవారిని అండగా చూసుకోవాల్సిన బాధ్యతను గుర్తు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘ఉద్యోగుల జవాబుదారీతనం, తల్లిదండ్రుల పోషణ పర్యవేక్షణ బిల్లు-2026’ను ప్రభుత్వం నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.
తల్లిదండ్రుల బాధ్యతను విస్మరించే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా ఈ బిల్లును రూపొందించారు. ఎవరైనా ఉద్యోగి తన తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోకపోతే, వారి నెలవారీ వేతనం నుండి 15% లేదా రూ.10,000 (ఏది తక్కువైతే అది) కట్ చేసి నేరుగా తల్లిదండ్రులకు చెల్లిస్తారు.
ఎవరికి వర్తిస్తుంది?
ఈ చట్టం కేవలం ప్రభుత్వ ఉద్యోగులకే కాకుండా.. ప్రైవేట్ ఉద్యోగులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు మరియు సర్పంచ్‌లకు కూడా వర్తిస్తుంది.
బాధితులైన తల్లిదండ్రులు సంబంధిత జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ఫిర్యాదు అందిన 60 రోజుల్లోపు సమస్యను పరిష్కరించి, తల్లిదండ్రులకు న్యాయం చేయాల్సి ఉంటుంది. సామాజిక బాధ్యతను పెంచే దిశగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా సర్వత్రా చర్చ నడుస్తోంది.


