వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు కరాటే బంగారు పతకం సాధించి రాష్ట్రస్థాయిలో మరోసారి తమ ప్రతిభను చాటుకున్నారు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “5వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ – 2026” లో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు అద్భుత ప్రతిభ కనబరిచారు.
ఈ క్రీడా పోటీలలో భాగంగా నిర్వహించిన కరాటే జట్టు విభాగంలో వరంగల్ కమిషనరేట్‌కు చెందిన కానిస్టేబుళ్లు నరసింహులు, రాకేశ్, సాయికుమార్ లతో కూడిన జట్టు అద్భుతమైన ప్రదర్శనతో బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. తమ అసాధారణమైన ప్రతిభతో వరంగల్ పోలీస్ కమిషనరేట్ కీర్తిని రాష్ట్ర స్థాయిలో చాటిచెప్పారు.
కమిషనర్ శ్వేత అభినందనలు:
రాష్ట్ర స్థాయి పోటీల్లో బంగారు పతకం సాధించి విజేతలుగా నిలిచిన కానిస్టేబుళ్లు నరసింహులు, రాకేశ్, సాయికుమార్‌లను వరంగల్ పోలీస్ కమిషనరర్ శ్వేత ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విధి నిర్వహణలోనే కాకుండా క్రీడల్లోనూ ఇలాంటి ప్రతిభ కనబరచడం అభినందనీయమని కొనియాడారు. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో మరిన్ని విజయాలు సాధించి, కమిషనరేట్‌కు మంచి పేరు తీసుకురావాలని ఆమె ఆకాంక్షించారు.
రాష్ట్రస్థాయి క్రీడల్లో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు కరాటే బంగారు పతకం సాధించడం కమిషనరేట్‌కు గర్వకారణంగా నిలిచిందని అధికారులు పేర్కొన్నారు.
Read Warangal News and Latest Politics News and Real Estate

