తెలంగాణ స్పెషల్ టెట్-2026 నోటిఫికేషన్ విడుదల.. జూలై 29 వరకు దరఖాస్తులు :
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల కోసం పాఠశాల విద్యాశాఖ స్పెషల్ టెట్-2026 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. గతంలోనే ఏడాదికి రెండు సార్లు స్పెషల్ టెట్ నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించగా, అందులో భాగంగా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ పరీక్షకు ప్రస్తుతం ప్రభుత్వ సేవలో ఉన్న ఉపాధ్యాయులు మాత్రమే అర్హులు.
ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?:
ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలు, తెలంగాణ గురుకుల విద్యాసంస్థలు (TGREIS), ప్రభుత్వ సంక్షేమ సొసైటీల ఆధ్వర్యంలోని రెసిడెన్షియల్ పాఠశాలలు, తెలంగాణ మోడల్ స్కూల్స్‌తో పాటు ఇతర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. బీఈడ్ లేదా డీఈడ్ పూర్తి చేసిన నిరుద్యోగ అభ్యర్థులకు ఈ స్పెషల్ టెట్‌లో పాల్గొనే అవకాశం ఉండదు.
దరఖాస్తుల తేదీలు, ఫీజు వివరాలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ జూలై 22 నుంచి ప్రారంభమై జూలై 29, 2026 వరకు కొనసాగుతుంది. జనరల్, బీసీ అభ్యర్థులు ఒక పేపర్‌కు రూ.750, రెండు పేపర్లకు రూ.1,000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు ఒక్కో పేపర్‌కు రూ.700, రెండు పేపర్లకు రూ.950 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
పరీక్షలు, హాల్ టికెట్లు, ఫలితాలు:
స్పెషల్ టెట్ పరీక్షలు సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఆన్‌లైన్ విధానంలో రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. మొదటి సెషన్ ఉదయం 9 నుంచి 11:30 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు ఉంటుంది. హాల్ టికెట్లను ఆగస్టు 31 నుంచి అధికారిక వెబ్‌సైట్ https://schooledu.telangana.gov.in/SCHOOLEDUCATION/ లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బోధించే ఉపాధ్యాయులు పేపర్-1, ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు బోధించే వారు పేపర్-2కు హాజరుకావాలి. ఫలితాలను సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో ప్రకటించనున్నారు. ప్రస్తుతం విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయులు 2028 ఆగస్టు 31లోపు టెట్ అర్హత సాధించాల్సిందే అని సుప్రీంకోర్టు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
Read Warangal News and Latest Politics News and Real Estate


