తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి విద్యావారోత్సవాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
హైదరాబాద్‌లోని ఎల్బీ (LB) స్టేడియంలో నేడు సాయంత్రం 5 గంటలకు జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ వారోత్సవాలను అధికారికంగా ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులను మెరుగుపరచడం మరియు విద్యా ప్రమాణాలను పెంపొందించడంపై ప్రభుత్వం తన స్పష్టమైన విజన్‌ను ప్రకటించనుంది.
మే 11 (నేడు) నుంచి ప్రారంభమై, ఈ నెల 17వ తేదీ వరకు ఈ వారోత్సవాలు కొనసాగుతాయి. ఈ వేడుకల్లో కేవలం ప్రభుత్వ యంత్రాంగమే కాకుండా విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేయనున్నారు.
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సర్కార్ చేపడుతున్న విప్లవాత్మక చర్యలను ప్రజలకు వివరించడం, స్కూళ్లలో కల్పిస్తున్న మౌలిక సదుపాయాలపై (Infrastructure) విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం, ప్రభుత్వ బడులలో మౌలిక వసతుల కల్పన, నాణ్యమైన విద్యను అందించడం ద్వారా పేద విద్యార్థులకు మెరుగైన భవిష్యత్తును అందించడమే ఈ ‘విద్యావారోత్సవాల’ వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశ్యం.
ఈ వారం రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో విద్యకు సంబంధించిన వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.


