తెలంగాణ/హనుమకొండ:
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. రేపటి (ఈ నెల 15) నుంచి విద్యార్థులకు పోషకాలతో కూడిన అల్పాహారం (బ్రేక్‌ఫాస్ట్) అందించే సరికొత్త పథకాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించనుంది. ఇందులో భాగంగా తొలి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 8 జిల్లాలను ఎంపిక చేశారు. మొత్తం 1,269 పాఠశాలలు, 33 జూనియర్ కళాశాలల్లో ఈ పథకాన్ని ప్రవేశపెడుతుండగా.. మొదటి దశలోనే 1,44,610 మంది విద్యార్థులకు ఉదయాన్నే వేడివేడి అల్పాహారం అందనుంది. రానున్న రోజుల్లో దశలవారీగా రాష్ట్రంలోని సుమారు 22 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకాన్ని విస్తరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
మెనూలో ఏముందంటే..?
విద్యార్థుల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ బ్రేక్‌ఫాస్ట్‌లో వైవిధ్యమైన, రుచికరమైన వంటకాలను చేర్చారు. మెనూలో దోశ, మిల్లెట్ ఇడ్లీ, పూరి, బోండా, ఉప్మా తదితర పౌష్టికాహారాలను వడ్డించనున్నారు.
హనుమకొండలో పైలట్ ప్రాజెక్ట్:
ఈ బ్రేక్‌ఫాస్ట్ పథకంతో పాటు ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థుల కోసం మధ్యాహ్న భోజన (మిడ్ డే మీల్స్) పథకాన్ని కూడా రేపటి నుంచే అధికారులు ప్రారంభించనున్నారు. హనుమకొండ జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద మూడు ప్రముఖ కళాశాలలను ఎంపిక చేశారు.
- హనుమకొండ కో-ఎడ్యుకేషన్ జూనియర్ కళాశాల
- వడ్డేపల్లి పింగిళి బాలికల కళాశాల
- ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాల
ఇటీవల ఈ కళాశాలల్లో నిర్వహించిన ట్రయల్ రన్ విజయవంతం కావడంతో, విద్యార్థుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం నాణ్యమైన భోజనం అందనుండటంతో అటు విద్యార్థులు, ఇటు తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read Warangal News and Latest Politics News and Real Estate


