తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించడంలో భాగంగా, ప్రభుత్వ ఉద్యోగులు కొనుగోలు చేసే ఎలక్ట్రిక్ వాహనాల (EV) పై 10% నుండి 20% వరకు రాయితీ ఇవ్వాలని నిర్ణయించినట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
మండలిలో జరిగిన చర్చ సందర్భంగా ఆయన ఈ కీలక ప్రకటన చేశారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5 లక్షల మంది ఉద్యోగులు లబ్ధి పొందుతారని అంచనా.
రాయితీతో పాటు వాహన రిజిస్ట్రేషన్ ఛార్జీలు, పన్నుల నుంచి కూడా మినహాయింపు లభిస్తుంది. ఇకపై ప్రభుత్వ అవసరాల కోసం కూడా కేవలం ఎలక్ట్రిక్ వాహనాలనే కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్యను భారీగా పెంచుతామని ఆయన స్పష్టం చేశారు. కాలుష్యాన్ని తగ్గించి, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ముందడుగు వేసింది.


