పట్టు చీరతో పట్టుబడిన దొంగ..ప్రపంచంలోనే వింతైన దొంగతనం..:
బండ్లగూడ: రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడేళ్ల క్రితం జరిగిన ఇంటి దొంగతనం కేసు అనూహ్యంగా పట్టు చీరతో ఛేదమైంది. చోరీకి గురైన పట్టు చీరను నిందితురాలు ఓ కుటుంబ వేడుకలో కట్టుకుని రావడంతో బాధితులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
ఆస్పత్రికి వెళ్లడంతో ఇంటికి తాళం:
బండ్లగూడ వినాయక్‌నగర్ కాలనీలో నివసించే యాదయ్య తన పిల్లలకు అనారోగ్యం కారణంగా 2023 సెప్టెంబర్ 16న మాదాపూర్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి ఆస్పత్రి వద్దే ఉన్నారు. సెప్టెంబర్ 19న ఇంటికి తిరిగి వచ్చేసరికి వస్తువులు చిందరవందరగా కనిపించాయి. అల్మారా పరిశీలించగా రూ.2.5 లక్షల నగదు, తొమ్మిది తులాల బంగారు ఆభరణాలు, పట్టు చీరలు సహా విలువైన వస్తువులు కనిపించలేదు.
చీరతో దొరికిన ఆధారం:
యాదయ్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినా నిందితులపై ఆధారాలు లభించకపోవడంతో కేసు దర్యాప్తు నిలిచిపోయింది. తాజాగా యాదయ్య కుటుంబానికి చెందిన ఓ వేడుకకు పక్కింటి మహిళ చోరీకి గురైన పట్టు చీరను కట్టుకుని వచ్చింది. ఆమెను గుర్తించిన యాదయ్య భార్య పోలీసులకు సమాచారం ఇచ్చారు.
దంపతుల అరెస్ట్:
పోలీసులు మహిళతో పాటు ఆమె భర్త బుగ్గ రాములును అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. రెండో తాళం చెవిని ఉపయోగించి ఇంట్లోకి ప్రవేశించి దొంగతనానికి పాల్పడినట్లు వారు అంగీకరించారు. నిందితుల నుంచి 8.7 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు దంపతులను రిమాండ్‌కు తరలించారు.


