చారిత్రక హన్మకొండలోని వేయి స్తంభాల గుడి (Thousand Pillar Temple) అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులను మంజూరు చేసింది. ఈ నిధులతో ఆలయ ప్రాంగణంలో నిలిచిపోయిన పనులను పూర్తి చేయనున్నారు.

ఆలయం పునర్నిర్మాణానికి రూ. 14.44 కోట్లు మంజూరు అయ్యాయి. అందులో భాగంగా ఆలయ ప్రాంగణంలోని కళ్యాణ మండపం పునర్నిర్మాణం, పెండింగ్లో ఉన్న పునరుద్ధరణ పనులు మరియు ఆలయ విస్తరణ కార్యక్రమాలు జరుగుతాయి.

కాకతీయుల కళా వైభవానికి ప్రతీకగా నిలిచే ఈ ఆలయాన్ని పూర్తిస్థాయిలో తీర్చిదిద్దేందుకు ఈ నిధులు ఎంతో కీలకం కానున్నాయి. వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య నిరంతర కృషితో ఈ నిధులు విడుదలకై కీలక పాత్ర పోషించారు. ఆమె పలుమార్లు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి Gajendra Singh Shekhawatను కలిసి ఆలయ అభివృద్ధి అవసరాన్ని వివరించినట్లు తెలిసింది. అదేవిధంగా పురావస్తు శాఖ అధికారులతో కలిసి ఆలయాన్ని సందర్శించి, పునరుద్ధరణ అవసరాలపై నివేదిక రూపొందించి కేంద్రానికి సమర్పించారు.



