హనుమకొండ: హనుమకొండలోని చారిత్రక వేయి స్తంభాల దేవాలయంలో కార్తీక మాసోత్సవాలు మంగళవారం భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని శ్రీ రుద్రేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు.
ఆలయంలో స్వామివారికి 11 లీటర్ల ఆవుపాలతో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, సామూహిక రుద్రాభిషేకాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ.. కులమతాలకు అతీతంగా భక్తి చైతన్యాన్ని పెంపొందించే పవిత్ర మాసం కార్తీక మాసమని పేర్కొన్నారు. భక్తులు సామూహికంగా దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించడం ఈ మాసం ప్రత్యేకత అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.


