వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించి, శాఖా నిబంధనలను ఉల్లంఘించిన ముగ్గురు పోలీస్ సిబ్బందిపై కమిషనర్ కఠిన చర్యలు తీసుకున్నారు. ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లతో పాటు ఒక కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
ఏఆర్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ యం. తిరుపతి పోలీస్ శాఖ నిబంధనలకు విరుద్ధంగా వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు నిర్ధారణ అయ్యింది. కేవలం వ్యాపారమే కాకుండా, సకాలంలో డబ్బు చెల్లించని వారి ఇళ్లపై దాడులకు కూడా పాల్పడినట్లు అభియోగాలు రావడంతో సీపీ ఆయనను సస్పెండ్ చేశారు.
హసన్‌పర్తి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ టి. రాములు మద్యం నైట్ ఇంచార్జిగా విధుల్లో ఉన్న సమయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంతో ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది.
చెన్నారావుపేట పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ఓ. రమేష్, స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేస్తూ అతిక్రమించినందుకు గాను ఆయనను కూడా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
శాఖలో క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడే వారిపై ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా కమిషనర్ హెచ్చరించారు.


