తిరుమల: తిరుమలకు వచ్చే భక్తులకు ఇకపై గోబీ వంటకాలు అందుబాటులో ఉండదు. క్యాలీఫ్లవర్లో పురుగులు ఉన్నాయంటూ భక్తుల నుంచి ఫిర్యాదులు రావడంతో టీటీడీ ఆరోగ్య విభాగం అప్రమత్తమైంది. క్యాలీఫ్లవర్‌తో తయారు చేసే గోబీ రైస్, గోబీ 65, గోబీ మంచూరియా వంటి వంటకాలను తిరుమలలోని హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో నిలిపివేయాలని సూచించారు. నేటి నుండే ఇది అమల్లోకి వచ్చింది.
తనిఖీల్లో పురుగుల గుర్తింపు:
తిరుమలలో ఇటీవల ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో కొన్ని హోటళ్లలో క్యాలీఫ్లవర్లో పురుగులు ఉన్నట్లు గుర్తించారు. దీంతో టీటీడీ హెల్త్ వింగ్ చర్యలకు సిద్ధమైంది. వారం రోజుల క్రితం హోటల్ నిర్వాహకులతో టీటీడీ హెల్త్ డిప్యూటీ ఈవో సోమనారాయణ సమావేశమయ్యారు. ఈ సీజన్లో క్యాలీఫ్లవర్లో పురుగులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందని, సరైన విధంగా శుభ్రం చేయకుండా వంటల్లో ఉపయోగిస్తే ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వివరించారు. భక్తుల నుంచి వస్తున్న ఫిర్యాదులను కూడా అధికారులు ప్రస్తావించారు.
అన్నదానంపై ఇంకా స్పష్టత లేదు:
ప్రస్తుతం ఆరోగ్య విభాగం సూచనలు హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లకే పరిమితమైనట్లు తెలుస్తోంది. తరిగొండ వెంగమాంబ నిత్య అన్నదాన కేంద్రంలో క్యాలీఫ్లవర్ వినియోగంపై ఇంకా స్పష్టత రాలేదు. నిత్యం భారీ సంఖ్యలో భక్తులు అన్నప్రసాదం స్వీకరిస్తుండగా, దాతల నుంచి వచ్చే కూరగాయల్లో అప్పుడప్పుడు క్యాలీఫ్లవర్ కూడా ఉంటుంది. టీటీడీ అధికారికంగా పూర్తిస్థాయి నిర్ణయం తీసుకుంటే అన్నదానంలోనూ క్యాలీఫ్లవర్ వినియోగాన్ని నిలిపివేసే అవకాశం ఉంది. అవసరమైతే దాతల నుంచి ఆ కూరగాయను స్వీకరించకుండా చర్యలు తీసుకునే అవకాశముందని తెలుస్తోంది.


