దేశంలోని మెట్రో నగరాలైన ముంబై, బెంగళూరు వంటి ప్రాంతాలతో పోలిస్తే ద్వితీయ శ్రేణి నగరాల్లో ఉద్యోగ అవకాశాలు వేగంగా పెరుగుతున్నాయి. లింక్డ్ఇన్ విడుదల చేసిన ‘Cities on the Rise 2026’ నివేదిక ప్రకారం.. తక్కువ జీవన వ్యయం, మెరుగైన డిజిటల్ మౌలిక సదుపాయాలు, కొత్త పెట్టుబడులు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (GCCs) కారణంగా పలు నాన్-మెట్రో నగరాలు ఉద్యోగ కల్పనలో ముందుకు సాగుతున్నాయి.
టాప్-10 నగరాలు ఇవే :
ఉద్యోగాల సృష్టిలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల జాబితాలో విశాఖపట్నం మొదటి స్థానంలో ఉంది. ఐటీ, ఫార్మా రంగాల్లో పెట్టుబడులు, టెక్ కంపెనీల విస్తరణ దీనికి ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. ఆ తర్వాత లుధియానా, సూరత్, వడోదర, ప్రయాగ్‌రాజ్, రాజ్‌కోట్, జబల్పూర్, రాంచీ, రాయ్‌పూర్, విజయవాడ వరుసగా ఉన్నాయి.
లుధియానాలో అధునాతన తయారీ రంగం, సూరత్‌లో డిజిటల్ ఎకానమీ, ఎగుమతులు, వడోదరలో కెమికల్, పెట్రోకెమికల్, ఫార్మా, ఐటీ రంగాలు వృద్ధికి దోహదం చేస్తున్నాయి. ప్రయాగ్‌రాజ్, జబల్పూర్ నగరాలు యువతకు ఉద్యోగ అవకాశాలను అందించడంలో ముందుకు సాగుతున్నాయి. రాంచీలో స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు, హాస్పిటాలిటీ, రీటైల్ రంగాలు విస్తరిస్తున్నాయి. రాయ్‌పూర్‌లో టెక్నాలజీ ఆధారిత పెట్టుబడులు, నయా రాయ్‌పూర్ అభివృద్ధి కీలకంగా మారాయి. విజయవాడలో ఐటీ కంపెనీల విస్తరణతో ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి.
తక్కువ ఖర్చు.. ఎక్కువ అవకాశాలు :
నాన్-మెట్రో నగరాల వైపు కంపెనీలు, ఉద్యోగులు ఆకర్షితులు కావడానికి ప్రధాన కారణాల్లో తక్కువ జీవన వ్యయం ఒకటి. మెట్రో నగరాలతో పోలిస్తే ఇక్కడ నివాసం, కార్యాలయ నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉంటాయి. అదే సమయంలో స్థానికంగా నైపుణ్యం కలిగిన యువత అందుబాటులో ఉండటం కంపెనీలకు ప్రయోజనంగా మారుతోంది.
తగ్గుతున్న ఉద్యోగుల మార్పిడి రేటు :
సొంత రాష్ట్రాల్లోనే మెరుగైన ఉద్యోగ అవకాశాలు లభిస్తుండటంతో ఉద్యోగులు ఇతర నగరాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతోంది. దీంతో ఉద్యోగుల మార్పిడి రేటు (Attrition) కూడా తక్కువగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం బిజినెస్ డెవలప్మెంట్, ఇంజినీరింగ్, సేల్స్, ఆపరేషన్స్ విభాగాల్లో ఈ నగరాల్లో నియామకాలు పెరుగుతున్నాయి.


