తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయాలు తీసుకుంది. వేసవి సెలవులు, వారాంతపు సెలవులు కలిసి రావడంతో దేశం నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు పూర్తిగా నిండిపోయాయి. ప్రస్తుతం క్యూలైన్ ఔటర్ రింగ్ రోడ్డులోని శిలాతోరణం వరకు విస్తరించినట్లు అధికారులు తెలిపారు.

భారీ రద్దీ కారణంగా సర్వదర్శనం కోసం వచ్చిన భక్తులకు దాదాపు 24 నుంచి 30 గంటల వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని టీటీడీ దర్శన విధానంలో పలు మార్పులు అమలు చేస్తోంది. ఇందులో భాగంగా వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖల ఆధారంగా ఇచ్చే అనుమతులను తాత్కాలికంగా రద్దు చేసింది.

ఇకపై వీఐపీలు, వీవీఐపీలు స్వయంగా తిరుమలకు వచ్చినప్పుడు మాత్రమే బ్రేక్ దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. గతంలో రోజుకు సుమారు 6 వేల నుంచి 6,500 వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలు మంజూరు చేసేవారు. అయితే ప్రస్తుతం వాటి సంఖ్యను 2 వేల నుంచి 2,500 మధ్యకే పరిమితం చేసినట్లు తెలుస్తోంది.

టీటీడీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, జూలై 15 వరకు సిఫార్సు లేఖల ఆధారంగా ఇచ్చే వీఐపీ బ్రేక్ దర్శనాలను పూర్తిగా నిలిపివేశారు. సాధారణ భక్తులకు ఎక్కువ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశముండటంతో తిరుమలకు వచ్చే వారు ముందస్తుగా దర్శనం, వసతి ఏర్పాట్లు చేసుకుని రావాలని టీటీడీ సూచిస్తోంది.


