దేశవ్యాప్తంగా ఉపాధ్యాయుల నియామకాలు, సర్దుబాటు ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నిర్దేశిత అర్హతలు లేని వ్యక్తులను పాఠశాలలు, కళాశాలల్లో ఉపాధ్యాయులు లేదా ట్యూటర్లుగా నియమించడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
TET, NET అర్హతలు తప్పనిసరి :
RTE చట్టం, NCTE, UGC నిబంధనల ప్రకారం ఉపాధ్యాయులుగా నియమితులయ్యేందుకు నిర్దేశించిన కనీస విద్యార్హతలు తప్పనిసరిగా ఉండాలని కోర్టు స్పష్టం చేసింది. సంబంధిత స్థాయికి అవసరమైన TET, NET వంటి అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించని వారిని నిబంధనలకు విరుద్ధంగా నియమించకూడదని పేర్కొంది.
విద్యార్థుల భవిష్యత్తుపై ఆందోళన :
అర్హతలు లేని వ్యక్తులను ఉపాధ్యాయులుగా నియమించడం వల్ల విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. సరైన అర్హతలు, పారదర్శకమైన ఎంపిక ప్రక్రియ లేకుండా ప్రభుత్వ ఉద్యోగాల్లో నియామకాలు చేపట్టడం సరికాదని వ్యాఖ్యానించింది.
నాణ్యమైన విద్య ప్రాథమిక హక్కు :
రాజ్యాంగంలోని ఆర్టికల్ 21-A ప్రకారం నాణ్యమైన విద్య ప్రతి చిన్నారికి ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు గుర్తుచేసింది. విద్యా ప్రమాణాలను కాపాడేందుకు భవిష్యత్తులో ఉపాధ్యాయుల నియామకాలు నిర్దేశిత నిబంధనలు, అర్హతలు, పారదర్శక విధానాలకు అనుగుణంగానే జరగాలని స్పష్టం చేసింది.


