హనుమకొండ: అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద చేపట్టనున్న అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన ప్రతిపాదనలు, సమగ్ర ప్రాజెక్టు నివేదికల (డీపీఆర్)పై రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కార్యదర్శి, సీడీఎంఏ డాక్టర్ టి.కె. శ్రీదేవి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్, జీడబ్ల్యూఎంసీ ప్రత్యేకాధికారి చాహత్ బాజ్‌పాయ్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి. వెంకన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగరంలో ఆర్థిక కార్యకలాపాల విస్తరణ, రవాణా ఆధారిత అభివృద్ధి, ప్రాంతీయ ప్రణాళిక, పట్టణ పునరుద్ధరణ వంటి అంశాలపై చర్చించారు.
అలాగే తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, నగర ప్రాంతాల పునరాభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలు, డీపీఆర్‌ల వివరాలను అధికారులు సమీక్షకు వివరించారు. నగరంలో పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, భవిష్యత్ పట్టణ విస్తరణను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వడంపై దృష్టి సారించారు.
అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ద్వారా నగరాభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంతో పాటు, ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిచ్చేలా సమగ్ర ప్రణాళికల రూపకల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు అధికారులు వివరించారు.


