సీతారాంపురంలో గ్రామదేవతల ప్రతిష్ట..ఇనగాల వెంకట్రామ్ రెడ్డి ప్రత్యేక పూజలు :
పరకాల మున్సిపాలిటీ: పరకాల మున్సిపాలిటీ పరిధిలోని సీతారాంపురం గ్రామంలో మూడు రోజుల పాటు భక్తిశ్రద్ధలతో నిర్వహించిన గ్రామదేవతల విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం వైభవంగా ముగిసింది. గ్రామ ప్రజలు, భక్తుల సమక్షంలో ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
మహోత్సవంలో భాగంగా శ్రీలక్ష్మి, భూలక్ష్మి సమేత బొడ్రాయి, పోచమ్మ, దుర్గమ్మ, మైసమ్మ గ్రామదేవతలతో పాటు నాగేంద్రస్వామి, నవగ్రహాల నూతన విగ్రహాలకు శాస్త్రోక్తంగా ప్రాణ ప్రతిష్ట నిర్వహించారు. అలాగే ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమాన్ని కూడా వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఘనంగా చేపట్టారు.
ముగింపు వేడుకలకు వరంగల్ కుడా ఛైర్మన్, హనుమకొండ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి నూతనంగా ప్రతిష్టించిన దేవతా విగ్రహాలను దర్శించుకున్నారు. అనంతరం గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు సన్మానం చేశారు.
ఈ సందర్భంగా ఇనగాల వెంకట్రామ్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామదేవతల అనుగ్రహంతో సీతారాంపురం గ్రామం సుఖశాంతులు, ఐశ్వర్యాలతో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. గ్రామ ప్రజలందరూ ఐకమత్యంతో ముందుకు సాగాలని సూచించారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో భక్తి భావాన్ని పెంపొందించడంతో పాటు సామాజిక ఐక్యతను బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు.
కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. మూడు రోజుల పాటు సాగిన ఈ మహోత్సవం విజయవంతంగా ముగియడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.
Read Warangal News and Latest Politics News and Real Estate


