ఆరోగ్యం బాగాలేదన్నా వదల్లేదు.. పోలీసుల తీరుపై వినయ్ భాస్కర్ ఫైర్..:
మాజీ ప్రభుత్వ చీఫ్ విప్, బీఆర్ఎస్ నేత దాస్యం వినయ్ భాస్కర్ తనను పోలీసులు అక్రమంగా నిర్బంధించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఆరోగ్యం బాగాలేదని చెప్పినా మూడు రోజులుగా నిర్బంధంలో ఉంచి ఎమర్జెన్సీ పరిస్థితులను తలపించేలా వ్యవహరిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు:
కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచక పాలనను అడ్డుకునేందుకు తాము ప్రజా సమస్యలపై అడుగులు వేస్తుంటే పోలీసులను ఉసిగొల్పి అక్రమంగా నిర్బంధిస్తున్నారని వినయ్ భాస్కర్ మండిపడ్డారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే హక్కును కూడా ప్రభుత్వం అడ్డుకుంటోందని విమర్శించారు.
పెద్ది విగ్రహం తొలగింపుపై నిరసన:
ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తొలగించడాన్ని నిరసిస్తూ నర్సంపేట ప్రజలు స్వచ్ఛందంగా బంద్కు పిలుపునిచ్చారని తెలిపారు. ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదని, తాము వెళ్లబోమని చెప్పినప్పటికీ పోలీసులు తనను నిర్బంధించడం ఏమిటని ప్రశ్నించారు.
ప్రజల మనసుల్లో పెద్ది:
అధికారాన్ని అడ్డుపెట్టుకుని పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తొలగించగలరేమో కానీ నర్సంపేట ప్రజల హృదయాల్లో ఆయనపై ఉన్న అభిమానాన్ని, ఆత్మీయతను చెరిపివేయలేరని దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు.


