హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నేలు గ్రామంలో అత్యంత ఘోరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. కేవలం ఆడపిల్లలు పుట్టారనే కారణంతో ఓ తండ్రి తన ఇద్దరు కుమార్తెలను మరియు భార్యను అతి దారుణంగా పొట్టనబెట్టుకున్నాడు.
ఫర్జానా (26), ఆమె కుమార్తెలు ఉమేరా (8), ఆయేషా (7)లని భర్త అజారుద్దీన్ కుటుంబ కలహాలు మరియు ఆడపిల్లలు పుట్టారనే కక్షతో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది.

లభించిన సమాచారం ప్రకారం, నిందితుడు అజారుద్దీన్ మొదట భార్య ఫర్జానాను, ఆమె కడుపులో ఉన్న పిండాన్ని అంతం చేశాడు. అనంతరం తన ఇద్దరు కుమార్తెలను స్విమ్మింగ్ పూల్‌లోకి నెట్టి, నీటిలో ముంచి ప్రాణాలు తీశాడు. ఈ ఘాతుకానికి పాల్పడిన అనంతరం నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం.

“ఆడపిల్లలుగా పుట్టడమే మా నేరమా?, మేము ఏం పాపం చేశాం నాన్న? ఆడపిల్లలుగా పుట్టడమే మా నేరమా?” అంటూ ఆ పసిప్రాణాలు మూగవేదనతో విగతజీవులయ్యాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


