వరంగల్: నగరంలోని ఉర్సుగుట్ట జంక్షన్ వేదికగా నిర్వహించిన ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా కార్యక్రమం అత్యంత విజయవంతమైంది. ప్రతి ప్రాణం విలువైనదే అనే నినాదంతో, ప్రజల్లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా వరంగల్ ట్రాఫిక్ పోలీసులు ఈ భారీ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఉర్సుగుట్ట వద్ద సుమారు 600 మంది జ్యోతీరావ్ ఫూలే పాఠశాల విద్యార్థులు మహా మానవహారంగా ఏర్పడి, రోడ్డు భద్రతపై నినదించారు. యువత ఉత్సాహంగా పాల్గొని వాహనదారుల్లో చైతన్యం నింపారు.

‘హెల్మెట్ ధరించండి – ప్రాణాలు నిలపండి’ అనే సందేశంతో, ద్విచక్ర వాహనదారులకు ఉచితంగా హెల్మెట్లను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సత్య శారద, అడిషనల్ కలెక్టర్ విజయ, డీసీపీలు దారా కవిత, అంకిత్ కుమార్, ఏఎస్పీ శుభం ప్రకాష్, ఆర్టీవో శోభన్ బాబు తదితరులు హాజరై ప్రసంగించారు.
ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన వల్ల జరుగుతున్న ప్రాణ నష్టాన్ని అరికట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు తీసుకున్న ఈ చొరవపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.


