వరంగల్లో ఆయుష్ సేవల అభివృద్ధిపై లోక్సభలో ఎంపీ కడియం కావ్య ప్రశ్న..:
వరంగల్: జిల్లాలో ఆయుష్ వైద్య సేవల అభివృద్ధిపై వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య లోక్సభలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జిల్లాలో ఆయుష్ వైద్య సేవల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎంత మేర నిధులు కేటాయించింది? ఎలాంటి మౌలిక వసతులు కల్పించింది? ఆయుష్ సేవలను సాధారణ వైద్య వ్యవస్థతో ఎలా అనుసంధానం చేస్తోంది? అనే అంశాలపై ఆమె ప్రశ్నలు లేవనెత్తారు.
కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం:
దీనికి స్పందించిన కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాధవ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. జాతీయ ఆయుష్ మిషన్ (NAM) కింద వరంగల్ జిల్లాలోని తొమ్మిది ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల్లో భవనాల మరమ్మతులు, తాగునీటి సదుపాయం, మరుగుదొడ్లు, శాశ్వత యోగా షెడ్ల నిర్మాణానికి కేంద్రం మద్దతు అందించినట్లు తెలిపారు. అలాగే ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రిలో అదనపు బ్లాక్ నిర్మాణం పూర్తయిందని వెల్లడించారు.
మూడు సంవత్సరాల్లో విడుదలైన నిధులు:
ప్రభుత్వ ఆయుర్వేద బోధనా ఆసుపత్రి, ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల అభివృద్ధితో పాటు తొమ్మిది ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు, రెండు ప్రభుత్వ ఆయుర్వేద డిస్పెన్సరీలకు అవసరమైన మందుల సరఫరా కోసం గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.
2023–24: రూ.56.16 లక్షలు
2024–25: రూ.24.32 లక్షలు
2025–26: రూ.3.23 కోట్లు
గ్రామీణ ప్రాంతాలకు ఆయుష్ సేవలు విస్తరించాలి: కడియం కావ్య
ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ, వరంగల్ ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించడంలో ఆయుష్ వైద్య వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. జిల్లాలో ఆయుర్వేదం, యోగా, హోమియోపతి వంటి ప్రత్యామ్నాయ వైద్య విధానాల విస్తరణకు మరింత నిధులు, ఆధునిక మౌలిక వసతులు అవసరమని అభిప్రాయపడ్డారు.
గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఆయుష్ సేవలను మరింత విస్తరించేలా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.


