వరంగల్: చారిత్రక భద్రకాళీ దేవాలయానికి వచ్చే భక్తులకు ఎండ తీవ్రత నుంచి ఉపశమనం కలిగించేందుకు ఆలయ యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల సౌకర్యార్థం సుమారు రూ.10 లక్షల వ్యయంతో అత్యంత ఆధునికమైన జర్మనీ సాంకేతిక టెంట్లను ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్నారు.
బుధవారం దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రామల సునీత, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ పనులకు సంబంధించిన ముందస్తు ఒప్పందాలు జరిగాయి. పనులు ప్రారంభించేందుకు గాను గుత్తేదారుకు రూ.2 లక్షల అడ్వాన్స్ చెక్కును అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు శేషు, ధర్మకర్తలు శ్రవణ్ కుమార్ రెడ్డి, క్రాంతి మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. రానున్న వేసవి దృష్ట్యా భక్తులు ఎండకు ఇబ్బంది పడకుండా, క్యూ లైన్లలోనూ, ఆలయ ప్రాంగణంలోనూ ఈ టెంట్లు ఎంతగానో ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు.


