రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి, సేంద్రీయ విధానంలో కూరగాయలు సాగు చేయడం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవచ్చని వరంగల్ జిల్లా కలెక్టర్ డా. సత్య శారద గారు రైతులకు సూచించారు.
గీసుగొండ మండలం కొనాయిమాకుల రైతువేదికలో జరిగిన కార్యక్రమంలో రైతులకు 100 శాతం రాయితీపై ఐదు రకాల కూరగాయల మినీ కిట్స్‌ను (టమాటా, పచ్చి మిరప, బెండ, తోటకూర, పాలకూర) కలెక్టర్ పంపిణీ చేశారు. బీన్స్, బోడ కాకర, బ్రకోలీ, పొట్లకాయ వంటి తీగజాతి కూరగాయలకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉందని, వాటిని సేంద్రీయ పద్ధతిలో సాగు చేయాలని రైతులకు సూచించారు. రసాయనిక ఎరువులు వాడకుండా పండించిన పంటలతో ఆరోగ్యం సిద్ధిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి శ్రీనివాసరావు, వ్యవసాయ అధికారి అనురాధ, వెటర్నరీ అధికారి బాలకృష్ణ, మత్స్య శాఖ అధికారి శ్రీపతి తదితరులు పాల్గొన్నారు.


