వరంగల్ సమస్యలపై ఢిల్లీలో పోరాటం..కమ్యూనిటీ రేడియోపై కీలక డిమాండ్..:
వరంగల్ జిల్లాలో కమ్యూనిటీ రేడియో కేంద్రం లేకపోవడం, కేంద్ర ప్రభుత్వ సమాచార ప్రచార కార్యక్రమాల అమలు తీరుపై వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య లోక్‌సభలో ప్రశ్నలు లేవనెత్తారు. కేంద్ర సంక్షేమ పథకాలు, ప్రజా అవగాహన కార్యక్రమాల సమాచారం ప్రజలకు మరింత చేరువ కావాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు.
కేంద్ర సమాచార శాఖను వివరాలు కోరిన ఎంపీ:
గత మూడు సంవత్సరాల్లో వరంగల్ జిల్లాలో కమ్యూనిటీ రేడియో స్టేషన్లు, మీడియా అవుట్‌రీచ్ కార్యక్రమాలు, ప్రజా చైతన్య కార్యక్రమాల కోసం కేంద్ర ప్రభుత్వం అందించిన సహాయం వివరాలను ఎంపీ కడియం కావ్య కోరారు. అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రచారం కోసం వరంగల్‌లో చేపట్టిన చర్యలు, వాటి ద్వారా లబ్ధి పొందిన వారి వివరాలను కూడా ఆమె అడిగారు.ఈ ప్రశ్నలకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం వరంగల్ జిల్లాలో ఒక్క కమ్యూనిటీ రేడియో స్టేషన్ కూడా లేదని ఆయన వెల్లడించారు.
వరంగల్‌లో కమ్యూనిటీ రేడియో అవసరం ఉందన్న ఎంపీ:
దేశవ్యాప్తంగా కమ్యూనిటీ రేడియో వ్యవస్థను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నప్పటికీ, వరంగల్‌లో మాత్రం ఇలాంటి వేదిక లేకపోవడం దురదృష్టకరమని ఎంపీ కడియం కావ్య అన్నారు.స్థానిక సమస్యలు, ప్రభుత్వ పథకాలు, ప్రజలకు అవసరమైన సమాచారాన్ని వేగంగా చేరవేయడంలో కమ్యూనిటీ రేడియోలు కీలక పాత్ర పోషిస్తాయని ఆమె తెలిపారు. వరంగల్‌కు కూడా ఇలాంటి సమాచార వేదిక అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందన్నారు.
17 అవుట్‌రీచ్ కార్యక్రమాలు నిర్వహించినట్లు కేంద్రం వెల్లడి:
గత మూడు సంవత్సరాల్లో వరంగల్, పరిసర ప్రాంతాల్లో 17 ఇంటిగ్రేటెడ్ కమ్యూనికేషన్ అండ్ అవుట్‌రీచ్ ప్రోగ్రామ్‌లు నిర్వహించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. యోగా దినోత్సవం, స్వచ్ఛ భారత్ అభియాన్, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, ఓటరు అవగాహన కార్యక్రమాలు, నషా ముక్త్ భారత్, పోషణ్ మాహ్ వంటి పలు అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించినట్లు వివరించింది.కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల సమాచారం ప్రతి ఒక్కరికీ చేరేలా మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఎంపీ కడియం కావ్య అన్నారు. వరంగల్‌కు రావాల్సిన అవకాశాలు, కేంద్ర సంస్థలు, అభివృద్ధి కార్యక్రమాల కోసం పార్లమెంట్లో నిరంతరం ప్రస్తావిస్తానని స్పష్టం చేశారు. వరంగల్‌కు సంబంధించిన ప్రతి అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే తన ప్రధాన లక్ష్యమని ఎంపీ పేర్కొన్నారు.


