వరంగల్: తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో ఆగస్టు మాసంలో రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న “సురక్ష కా తిరంగా – సైబర్ స్వతంత్ర తెలంగాణ” అవగాహన ప్రచార పోస్టర్‌ను వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత ఐపీఎస్ ఆవిష్కరించారు.
కమిషనరేట్ కార్యాలయంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఈ పోస్టర్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా సీపీ శ్వేత మాట్లాడుతూ.. స్వాతంత్ర్య మాసాన్ని పురస్కరించుకుని ఆగస్టు నెల పొడవునా సైబర్ నేరాల నివారణపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా స్టాక్ ఇన్వెస్ట్మెంట్, బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ పేరిట జరిగే ఆర్థిక మోసాల పట్ల ప్రజలు తీవ్ర అప్రమత్తతతో ఉండాలని సూచించారు.
ఆగు – ఆలోచించు – నిజం నిర్ధారించు
ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా “ఆగు – ఆలోచించు, నిజం నిర్ధారించు, సైబర్ భద్రత పెంచు” అనే సూత్రాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని సీపీ పిలుపునిచ్చారు.
నెల పొడవునా అవగాహన సదస్సులు
జాతీయ సైబర్ జాగృక్తా దివస్ సందర్భంగా ఆగస్టు 5 నుండి వరంగల్ కమిషనరేట్ వ్యాప్తంగా వివిధ రంగాల భాగస్వామ్యంతో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు సీపీ వెల్లడించారు.
పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, వ్యాపార సంస్థలు, పరిశ్రమలు, మహిళా సంఘాలు, ఆర్‌డబ్ల్యూఏల పరిధిలో ప్రత్యేక సదస్సులు. ఎవరైనా సైబర్ మోసానికి గురైతే తక్షణమే 1930 ఉచిత నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు.
ప్రతి పౌరుడి అప్రమత్తతతోనే సైబర్ భద్రత కలిగిన, సైబర్ స్వతంత్ర తెలంగాణ నిర్మాణం సాధ్యమవుతుందని సీపీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్ ఏసీపీ వెంకటరమణ, ఇన్స్పెక్టర్ అశోక్, ఎస్ఐ చరణ్ తదితరులు పాల్గొన్నారు.
𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲


